12 మెట్టు: క్రిస్మస్ కథ – దేవుడు మనతో నివసించుటకు వచ్చెను

మరియ, యోసేపు తమ ఇంటికి దూరంగా ఉన్న బెత్లహేము అను గ్రామములో ఉన్నప్పుడు, మరియకు ప్రసవ సమయము సమీపించెను. వారికి ఉండుటకు అక్కడ ఏ సత్రము (యాత్రికులు ఉండు స్థలము) లోను స్థలము లేకపోయింది. ఆ కారణమున, ఆ బాలుడు ఒక పశువులపాకలో జన్మించి, ఒక పశువుల తొట్టి (పశువులు గడ్డి మేయు తొట్టి) లో అతని తల్లి ద్వారా పెట్టబడినాడు.

ఈ పాప లోకమునకు దేవుని కుమారుడు, మీ కొరకు, నా కొరకు వేంచేసారు. మన పాపముల వలన మనము దేవుని చేరలేకయున్నందున దేవుడే మనతో నివసించుటకు దిగి వచ్చెను.

ఆ రాత్రి అంతయు నిశ్శబ్ధంగా ఉండిన సమయమున ఆకస్మికముగా, దేవుడు తన దేవదూతల సమూహమును తన కుమారుని జననమును చాటి చెప్పుటకు పంపెను. ఎవరి వద్దకు? పొలములో ఉన్న వినయముగల్గిన గొర్రెల కాపరుల యొద్దకు.

బైబిలు ‘వారి చుట్టు దేవుని వెలుగు ప్రకాశించెను’ అని చెబుతుంది.

గొర్రెల కాపరులతో ఒక దేవదూత ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు’ అని చెప్పెను.

ఆ తరువాత, దేవదూతల సమూహము ‘సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక’ అని దేవునికి  స్తోత్రము చేయుచుండెను.

గొర్రెల కాపరులు, త్వరపడి క్రొత్తగా జన్మించిన రక్షకుని చూచుటకు వెళ్లి, అందరితో ఆయనను గూర్చి చెప్పిరి.

దేవుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రమును ఆకాశములో ఏర్పాటు చేసారు. కొందరు తూర్పు దేశపు జ్ఞానులను ప్రభువైన యేసు వద్దకు ఆ నక్షత్రము నడిపించింది. వారు ఒక రాజును వెదకుచూ, ఆ నక్షత్రమును ఎన్నో దినములు వెంబడించిరి. ఒక రాజు గృహములో కాకుండా, ఒక సాధారణమైన ఇంటిలో, వినయముగల తల్లితండ్రుల వద్ద ఉన్న బాలుని వారు కనుగొనిరి.  అయితే వారు సందేహించలేదు!

వారుయెంతో సంతోషముతో సాగిలపడి ఆ బాలుని పూజించిరి. రాజుకు సరిపడిన బహుమతులు ఆయనకు బహూకరించిరి.

క్రిస్టమస్ పండుగను ప్రపంచమంతా ప్రభువైన యేసు జన్మదినంగా క్రైస్తవులు జరుపుకొంటారు.

ఈ రోజు నేను రాజైన యేసుకు ఒక విలువైన బహుమతిని ఇవ్వదలచాను. నా జీవితమును, హృదయమును ఆయనకు ఇచ్చుచున్నాను. మీరు కూడా మీ హృదయమును, జీవితమును ఆయనకు ఇస్తారా?

ప్రార్ధన: “ప్రభువైన యేసు, ఈ పాపకరమైన లోకమునకు, నా కొరకై బాలునిగా దిగి వచ్చినందుకు మీకు వందనములు!” ఆమెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *